Maa Telangana News
Date of Publish : 25/10/2026, 8:00 am
Published by Muthyala Praveen Reddy

ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపు..

  • నీటి వృథాను అరికట్టాలి
  • ఇంకుడు గుంతలే పరిష్కారం

*- గ్రామస్తులకు ఉపసర్పంచ్ మల్లేష్ యాదవ్ సూచన*

*(తిమ్మాపూర్/మా తెలంగాణ ప్రతినిధి)*

పంచభూతాలలో ప్రధానమైన నీరు లేనిదే మానవ మనుగడే లేదని,ప్రతి నీటి చుక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రామకృష్ణ కాలనీ ఉపసర్పంచ్ పోలం మల్లేష్ యాదవ్ అన్నారు.శనివారం గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రస్తుతం వేసవి కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో 20 అడుగులకే నీరు పడే పరిస్థితి నుండి నేడు 200, 300 అడుగులు తవ్వినా నీరు రాని పరిస్థితి ఏర్పడిందని, దీనికి ప్రధాన కారణం నీటిని వృథా చేయడమేనని అన్నారు.

*నీటి వృథాను అరికట్టాలి:*

ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కుళాయిలు తెరిచి వదిలేయడం,పిచ్చి మొక్కలకు నీరు పోయడం,వాహనాలను పైపులతో కడగడం వంటి చర్యల వల్ల వేల లీటర్ల నీరు వృథా అవుతుందని తెలిపారు.బకెట్ తోనే వాహనాలు కడగడం,చెట్లకు అవసరమైనంత నీరు మాత్రమే పెట్టడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఎంతో నీటిని ఆదా చేయవచ్చని అన్నారు.

*ఇంకుడు గుంతలే పరిష్కారం:*

భూగర్భ జలాలను పెంచడానికి ఉన్న ఏకైక మార్గం ఇంకుడు గుంతల నిర్మాణమేనని ఆయన స్పష్టం చేశారు.వర్షపు నీరు వృథాగా రోడ్లపైకి పోకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకితే బోర్లు,బావుల్లో నీటి మట్టం పెరుగుతుందని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు.గ్రామంలో ఎవరైనా తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత తవ్వితే,పనులు పూర్తయిన వెంటనే వారి బ్యాంక్ అకౌంట్ లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయని,కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఇది కేవలం ఒకరి బాధ్యత కాదని,గ్రామం మొత్తం కలిసి చేస్తేనే రేపటి భావితరాలకు నీటి కొరత లేకుండా చేయగలమని,ప్రతి ఒక్కరూ తమ పక్కింటి వారికి కూడా ఈ విషయాన్ని చెప్పి నీటి పొదుపుపై చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు.

*సదా మీ సేవలో..*

*పోలం మల్లేష్ యాదవ్,*

*ఉపసర్పంచ్, రామకృష్ణ కాలనీ.*

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save