Maa Telangana News
Date of Publish : 27/10/2026, 6:28 am
Published by Muthyala Praveen Reddy

తెలియజేస్తేనే తగ్గుతుంది నేరం - విద్యార్థులకు పోక్సో పై అవగాహన

  • బాలల హక్కులు,రక్షణ గురుంచి విద్యార్థులకు అవగాహన.
  • సురక్షిత బాల్యమే లక్ష్యంగా జిల్లాలో ప్రత్యేక ప్రచారం.
  • జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం.
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివ కుమార్ ఆధ్వర్యంలో వారోత్సవాలు.

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ పత్రిక ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి)అక్టోబర్-27

కరీంనగర్ జిల్లాలో సురక్షిత బాల్యమే లక్ష్యంగా జిల్లాలో ప్రత్యేక ప్రచారం.బాలలపై లైంగిక నేరాలను అరికట్టి,వారి హక్కులను పరిరక్షించడంతోపాటు ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’లో భాగంగా కరీంనగర్ జిల్లాలో పాఠశాలల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం తీగలగుట్టపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) మార్గదర్శకాలు,తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్,జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివ కుమార్ అనుమతితో అక్టోబర్ 26 నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ తెలిపారు. తీగలగుట్టపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు,న్యాయవాదులు ఏ.కిరణ్ కుమార్, సీహెచ్.చంద్ర ప్రకాష్ రెడ్డి, పి.రంగయ్య లు విద్యార్థులకు బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం–2012 (పోక్సో చట్టం)పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలలపై లైంగిక వేధింపులను గుర్తించడం,అనుచిత ప్రవర్తన ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, అలాంటి ఘటనలను తల్లిదండ్రులు లేదా విశ్వసనీయ పెద్దల దృష్టికి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలను వివరించారు.బాధిత బాలలకు చట్టం కల్పిస్తున్న రక్షణ, అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సహాయ సేవల గురించి తెలియజేశారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా,మౌనంగా ఉండకుండా విశ్వసనీయ పెద్దలకు తెలియజేసి సహాయం పొందాలని న్యాయవాదులు విద్యార్థులకు సూచించారు.బాలల భద్రత విషయంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పగలిగే వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు.బాలల హక్కులపై అవగాహన పెంపొందించడం,పోక్సో చట్టంపై విద్యార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం కల్పించడం,బాలలపై లైంగిక నేరాల నివారణకు సామాజిక చైతన్యం తీసుకురావడమే ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశమని సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరుణశ్రీ,చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దూస మమత,విద్యార్థులు పాల్గొన్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save