Maa Telangana News
Date of Publish : 01/11/2026, 7:26 pm
Published by Muthyala Praveen Reddy

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు

అమరావతి నవంబర్-1(మాతెలంగాణ బ్యూరో):

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల సమయానికి క్యూలైన్లలో నిలబడిన ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు.రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు,79 మున్సిపాలిటీలు,నగర పంచాయతీలు - మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగాయి.8 చోట్ల ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల పోటీ హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల కోసం 99.36 లక్షల మంది ఓటర్లు, 11,378 పోలింగ్ కేంద్రాలు, 10,262 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

*నగరాల్లో మందకొడి, పల్లెల్లో జోరు!*

ఈసారి పోలింగ్ సరళి ఆసక్తికరంగా సాగింది. ప్రధాన నగరాల్లో ఓటర్లు నిరాసక్తత ప్రదర్శించగా, చిన్న పట్టణాల్లో మాత్రం ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర సగటు 48.03% గా నమోదైంది. కర్నూలు జిల్లా గూడూరులో అత్యధికంగా 83.6% నమోదు కాగా, విశాఖ జీవీఎంసీ లో అత్యల్పంగా 39.74% మాత్రమే నమోదైంది. విజయవాడ 41.80%, గుంటూరు 40.99%, తిరుపతి 42.12% గా ఉంది.

*చెదురుమదురు ఘటనలు:*

ఒంగోలులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని, రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేసింది. మరోవైపు పాలకొండలో ఓ నవ వధువు పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటు వేయడం అందరినీ ఆకట్టుకుంది.విజయవాడ 55వ డివిజన్ లో బ్యాలెట్ గుర్తులు తారుమారవడంతో పోలింగ్ ను రాత్రి 7.45 వరకు పొడిగించారు.మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save