Maa Telangana News
Date of Publish : 22/10/2026, 7:00 pm
Published by Muthyala Praveen Reddy

ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు

  • బీసీ-ఏ అంశంపై న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్ణయం.
  • ట్యాంక్ బండ్ పరిసరాల్లో పండుగ సాయన్న,దొడ్డి కొమురయ్య విగ్రహాలు.సర్వాయి పాపన్న, పూలే దంపతుల తరహాలోనే ఏర్పాటు.
  • కులగణనతో బీసీల లెక్కలు పక్కాగా ఉన్నాయి.దేశానికే ఆదర్శంగా తెలంగాణ కులగణన.పేదల కోసం పోరాడిన పాలమూరు బిడ్డ పండుగ సాయన్న.
  • ముదిరాజులకు అన్నివిధాలుగా అండగా ఉంటాం.
  • సీఎం రేవంత్ రెడ్డి

(హైదరాబాద్/మాతెలంగాణ బ్యూరో) 

ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ గ్రూపులో చేర్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పండుగ సాయన్న 174వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పండుగ సాయన్న చిత్రపటానికి పూలతో నివాళులర్పించి,ఆయనపై రూపొందించిన పాటలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో సరైన లెక్కలు లేకపోవడంతో ముదిరాజులను గ్రూపు మార్చే ప్రతిపాదనను న్యాయస్థానాలు తిరస్కరించాయన్నారు. ఇప్పుడు కులగణన లెక్కలు పక్కాగా ఉన్నాయని, న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం న్యాయ నిపుణులతో చర్చించి అధ్యయనం చేస్తుందని తెలిపారు.ముదిరాజులను బీసీ-ఏ లో చేర్చడం వల్ల గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందన్న అపోహలను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సూచించారు.కులగణనతో బీసీల లెక్కలు పక్కాగా ఉన్నాయని,సామాజిక న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ లాగే ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. పేదల కోసం పోరాడిన పండుగ సాయన్న పాలమూరు బిడ్డ కావడం గర్వంగా ఉందన్నారు.గత ప్రభుత్వ పథకాలను రద్దు చేయకుండా మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని, సన్నబియ్యం,ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను వివరించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి,డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్,ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్,ఈటల రాజేందర్,సలహాదారు వీ హనుమంతరావు,మరియు ముదిరాజ్ కుల బాంధవులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save