పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్త - గంజాయి చాక్లెట్ మాయలో పడొద్దు!

(సామాజిక సేవకులు కవి రచయిత)
పసుల రవికుమార్ పటేల్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ డిటిఎఫ్ కరీంనగర్.
(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ పత్రిక ప్రతినిధి)
వచ్చిందిరా బిడ్డా,వచ్చిందిరా కన్నా,వచ్చిందిరా కొడుకా! గంజాయి చాక్లెట్లు వచ్చిందిరా.గంజాయి చాక్లెట్ దాన్ని పట్టబోకు బిడ్డా, దాన్ని ముట్టబోకు బిడ్డా. వద్దు, వద్దు, గంజాయి అలవాటు వద్దు! గంజాయికి అలవాటు పడితే,నీ బతుకులు అగ్గిపాలు,బుగ్గిపాలు రా.దాని అలవాటున పడకురా, అది నీకు దినదినం గండంగా మారుతుంది.నీ బతుకంతా చిందరవందర అవుతుంది.నువ్వు చదువుకోవాలని పట్టణానికి పంపిస్తే,ఉద్యోగం చేయాలని పట్టణానికి పంపిస్తే,నువ్వు మంచిగా బతకాలని పట్టణాలకు పంపిస్తే,ఎవరితోటో సోపతి గాళ్లతోటి డ్రగ్స్,గంజాయికి అలవాటు పడ్డావు.నీ కుటుంబం చిన్నాభిన్నం,మీ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతారు.నువ్వు మంచిగా చదువుకోవాలని,మంచి ఉద్యోగం చేయాలని,మంచి భవిష్యత్తు నీకు ఉండాలని,నీ ఖర్చులకు చేను,చెలక, పొలము,గొడ్డు,గోదా,నాగ,నట్రా అమ్మి, తాకట్టు పెట్టి,నీ బంగారు భవిష్యత్తు కోసం కోటి కలలు కన్న తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకోండి.మంచి భవిష్యత్తును దిద్దుకోండి,బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.నీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.మీరు నిషాకు అలవాటు పడితే, తల్లిదండ్రుల గుండెలు ఆగిపోయి,నీకు చివరి చూపు చూసే భాగ్యం కూడా కలుగకుండా, తల్లిదండ్రులు శవాలుగా మిగిలిపోతారు. యువకుల్లారా,నేటి యువత మీరందరూ గంజాయి,డ్రగ్స్ ముట్టనని ప్రతిజ్ఞ చేయండి. గంజాయి అమ్ముతున్న వారిని ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ వాళ్లకు పట్టించండి.మీకు అండగా పోలీసు వాళ్ళు,ఎక్సైజ్ వాళ్ళు, ప్రభుత్వం నిలుస్తుంది.అందరూ కలిసి గంజాయి,డ్రగ్స్ అరికట్టడానికి రండి,ముందుకు రండి.
ఇదీ చదవండి :: కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా నిలుపుదాం - డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుదాం













